నిషిత్ ని అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేశారు.. పిల్లలు చనిపోయినప్పుడు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?!!
నిషిత్ నారాయణ. ఏపీ మంత్రి కుమారుడు. ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ వార్త రెండు తెలుగు, రాష్ట్రాల్లోనూ సంచలనమే అయింది. అంతటి వేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి అతను చనిపోవడంతో రోడ్డు ప్రమాదాలపై మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నిషిత్‌కు అతని స్వస్థలమైన నెల్లూరులో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే అంతకు ముందు నిషిత్‌కు అరటి చెట్టుతో పెళ్లి జరిపించారు. అవును, మీరు విన్నది కరెక్టే. కానీ చాలా మందికి ఈ వార్త తెలియదు. అయితే అసలు వారు అలా ఎందుకు చేశారో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..!హిందూ ధర్మం ప్రకారం ఏ వ్యక్తి అయినా కచ్చితంగా వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే పురాణాల ప్రకారం వివాహమనే సంస్కారం పూర్తి కాదు. దీని వల్ల ఆ వ్యక్తులకు మోక్షం లభించదు. అలాంటి వారి ఆత్మలు భూమిపైనే ఉంటాయట. వారికి మళ్లీ జన్మ ఉండదట. కనుక హిందువులు కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లి చేసుకుంటే గృహస్థ ధర్మం పూర్తయి పిల్లల ద్వారా వారికి మోక్షం, స్వర్గ ప్రాప్తి లభిస్తాయట. అందుకే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెబుతారు.
అయితే మరి పెళ్లి చేసుకోకుండా చనిపోతే..? అప్పుడెలా..? అంటే… అందుకు ఓ మార్గం ఉంది. అదేమిటంటే… చనిపోయిన వ్యక్తికి పెళ్లి కాకపోతే అతని అంత్యక్రియలకు ముందుగా అతనికి, అరటి చెట్టు (లేదా రావి చెట్టు)కి ఇచ్చి పెళ్లి చేస్తారు. అనంతరం అంత్య క్రియలు నిర్వహిస్తారు. దీంతో పైన చెప్పిన విధంగా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్లకే ఎందుకంటే వీటిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. అరటి చెట్టునైతే వివాహాది శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతేకాదు, కుజ దోషం ఉన్న కొందరు వ్యక్తులు కూడా తాము పెళ్లి చేసుకోబోయే ముందు అరటి చెట్టును పెళ్లి చేసుకుంటారు. ఆ చెట్టును ఓ వ్యక్తిలా భావించి ఆ పని చేస్తారు. దీంతో దోషం పోతుందని నమ్ముతారు. ఇక ఆ తరువాత ఎవర్ని పెళ్లి చేసుకున్నా ఎలాంటి దోషం ఉండదని, దాని వల్ల ఎవరికీ ఏమీ కాదని నమ్ముతారు. అందుకనే అరటి చెట్టును పెళ్లి చేసుకుంటారు.