మదర్స్ డే స్పెషల్: అమ్మ ప్రేమకు నిదర్శనం.. ఈ కోతి బాధ చూస్తే ఎవరికైనా కళ్ల వెంట నీళ్లు రాలతాయి!!

తరాలు మారినా తల్లీ బిడ్డల బంధంలో మాత్రం ఎటువంటి మార్పూలేదు. థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా కల్తీకాని బంధం ఈ ప్రపంచంలో ఏదయినా నూరు శాతం స్వచ్ఛంగా మిగిలి ఉందంటే అది ఒక్కటే. యుగాలు మారినా సృష్టిలో అమ్మ ప్రేమది మాత్రం ప్రత్యేక స్థానం. ఈ ప్రపంచంలో బిడ్డపై తల్లి చూపించే ఆత్మీయత వెలకట్టలేనిది. ఇది మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు. సృష్టిలోని సమస్త జీవరాశులకూ అది పుట్టుకతోనే వస్తోంది. ఇటీవల జబల్‌పూర్‌కి చెందిన అవినాశ్‌ లోథి అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఓ ఫొటో చూస్తే కళ్లు చెమర్చక మానవు. సరదాగా కోతులన్నీ ఆడుకుంటుండగా అందులో ఓ పిల్ల కోతి అకస్మాత్తుగా దెబ్బతిని అపస్మారక స్థితికి చేరుకుంది. దానిని తిరిగి మామూలు కోతిని చేసే వరకు ఆ తల్లి కోతి పడిన తపన ఉంది చూశారు… అది మాటల్లో చెప్పలేనిది. ఆ సమయంలో పిల్లకోతిని చేత్తో కాస్త పైకి లేపి తల్లి కోతి ఏడుస్తూ ఉండటం ఆ దృశ్యాలన్నీ అవినాశ్‌ తన కెమెరాతో క్లిక్‌మనిపించారు.

ఆ తల్లి మనసు తల్లిడిల్లిన వైనంతో బతికి బట్టకట్టిందో (సారీ కోతులు డ్రెస్ వేసుకోవు) ఏమోగాని, ఆ కోతి పిల్ల ప్రాణానికయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాసేపటి తరువాత అది మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. అయితే తన పిల్లకి ఏమైందో అని ఆ కొద్దిసేపు తల్లికోతి పడిన వేదన ఈ సృష్టిలోనే మోస్ట్ పెయిన్ ఫుల్ సిచ్యుయేషన్ అనాలేమో. అన్నట్టు మనుషులతో పాటు జంతువులకూ భావోద్వేగాలు ఉంటాయడానికి ఈ చిత్రం చక్కని నిదర్శనం. అఫ్ కోర్స్ ఇప్పుడు మనుషులకు ఆ ఎమోషన్స్ తగ్గుతున్నాయనుకోండి..

ఏప్రిల్‌లో జబల్‌పూర్‌లో కోతుల ఫొటోలను తీస్తుండగా ఈ ఘటన తారసపడిందని ఫొటోగ్రాఫర్‌ అవినాశ్‌ తెలిపారు. ఇప్పుడు ఈ దృశ్యం రెగ్యులర్ మీడియా, సోషల్ మీడియాలో లక్షలాది మందిని కంటతడిపెట్టిస్తోంది. అమ్మప్రేమకు ఉన్న ప్రత్యేకత అది మరి. అన్నట్టు ఈరోజు మదర్స్ డే.. మీకు అద్భుతమైన జీవితాన్నిచ్చిన ఆ తల్లికి ఎట్ లీస్ట్ ఓ కృతజ్ఞత మీకు తోచిన రీతిలో చెప్పండి. ఒక్కటి మాత్రం నిజం మనం ఎంత చేసినా ఆ రుణం మాత్రం ఎన్నటికీ తీరనిదని మాత్రం మరువకండి..